Drinking habit: మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్‌ వైరల్‌

తాగుడుకు బానిసైన (drinking habit) తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు భార్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాగుడును ఇలా మాన్పించాలంటూ ఓ మంత్రి చేసిన సూచన వైరల్‌గా మారింది. 

Updated : 29 Jun 2024 12:47 IST

భోపాల్‌: మద్యం వ్యసనం (drinking habit) ఎన్నో సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా (Narayan Singh Kushwaha) ఓ సూచన చేశారు. అయితే ఆయన చెప్పిన టిప్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

నారాయణ్‌ సింగ్ మాట్లాడుతూ..‘‘ఆడవారు తమ ఇంట్లోని పురుషులు మద్యం మానేయాలని కోరుకుంటే.. ముందుగా వారిని బయట తాగొద్దని చెప్పండి. ఆ మద్యాన్ని ఇంటికి తెచ్చుకొని, మీ ముందు కూర్చొని తాగమని చెప్పండి. వారు కుటుంబసభ్యుల ముందు తాగితే.. ఆ అలవాటు వారిలో క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది. తర్వాత రోజుల్లో దానికి పూర్తిగా దూరం అవుతారు. వారు తమ భార్యాపిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. దానిని పిల్లలు చూస్తే వారు కూడా అదే దారిలో నడిచే ప్రమాదం ఉంటుందని వారికి గుర్తుచేయండి. ఈ పద్ధతి బాగా పని చేయొచ్చు’’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘మంత్రి ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ.. ఆయన దానిని చెప్పిన విధానం సరిగా లేదు. ఇంట్లో మద్యం తాగడం వల్ల ఆ ఇల్లు గృహహింసకు కేంద్రంగా మారుతుంది. ఈ సలహా బదులుగా అసలు తాగొద్దని చెప్తే బాగుండేది’’ అని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని