NEET UG-2024: నీట్‌-యూజీ 2024.. రద్దు చేయకపోవడానికి కారణం అదే: విద్యాశాఖ మంత్రి

నీట్‌-యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నా.. ఎందుకు రద్దు చేయడం లేదో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వివరించారు. 

Published : 22 Jun 2024 19:42 IST

దిల్లీ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ2024 ప్రవేశపరీక్ష (NEET UG-2024)’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పరీక్షకు ముందు రోజే పేపర్‌ లీకైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.పేపర్‌ లీకైనట్లు ఓ వైపు కేంద్రం పరోక్షంగా అంగీకరిస్తున్నా.. పరీక్షను రద్దుకు మాత్రం ససేమిరా అంటోంది. అసలు నీట్‌ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ (Dharmendra Pradhan) వివరించారు. 

నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజ్‌ వల్ల కొందరు విద్యార్థులు లాభపడి ఉన్నప్పటికీ.. పరీక్షను రద్దు చేస్తే ఎంతో కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. పాసైన వారి కష్టమంతా వృథా అవుతుందని చెప్పారు. 2004, 2015లో ఈ తరహా ఘటనలే చోటు చేసుకున్నాయని, అయితే లీకేజీ వ్యవహారం భారీ ఎత్తున జరగడంతో అప్పట్లో పరీక్షను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. అయితే, ఈసారి లీకేజీ కొన్ని సెంటర్లలో మాత్రమే జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు నీట్‌-యూజీ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. జులై 6న నిర్వహించాల్సిన కౌన్సిలింగ్‌ను యథాతథంగా కొనసాగించాలని శుక్రవారం ఆదేశించింది. అంతేకాకుండా పేపర్‌ లీకేజీపై పెనుదుమారం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని