WhatsApp: వాట్సప్‌లో ఏఐ స్నేహితుడు

ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్‌ ఇంజిన్‌నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్‌లో చాట్‌ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు.

Updated : 01 Jul 2024 07:09 IST

చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చిన మెటా
కావాల్సిన సమాచారం అంతా అందులోనే! 

ఈనాడు, అమరావతి: ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్‌ ఇంజిన్‌నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్‌లో చాట్‌ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. అదే మెటా ఏఐ. వాట్సప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఇప్పుడిప్పుడే యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. గత నాలుగైదు రోజుల్లో చాలా మందికి ఈ అప్‌డేట్‌ వచ్చింది. ఆండ్రాయిడ్‌లో కుడివైపు కింద భాగంలో.. ఐఫోన్‌లో అయితే డిస్‌ప్లే పైభాగంలో కెమెరా ఐకాన్‌ పక్కన నీలంగా రింగు ఆకారంలో ఒక ఐచ్ఛికం కనిపిస్తోంది. దాన్ని నొక్కి అనుమతి ఇస్తే.. మన చాటింగ్‌కు స్పందిస్తుంది. మనకి ఏం కావాలో చెబితే శోధించి తాజా సమాచారాన్ని మీ ముందు ఉంచుతుంది. టెక్ట్స్‌ రూపంలో అడిగితే దానికి అనుగుణంగా ఏఐ ఫొటోలు, యానిమేషన్‌ క్లిప్పింగులనూ సృష్టిస్తుంది. మీకు అందించే సమాచారం పూర్తిగా కావాలంటే ఎక్కడ లభిస్తుందో కూడా సూచిస్తుంది. అలాగని వ్యక్తిగత జీవితం, వారి గోప్యతను దెబ్బతీసే విషయాలు, ఆరోగ్యం తదితర అంశాలపై ఊహాజనిత ప్రశ్నలు అడిగితే మాత్రం వ్యక్తుల గోప్యతను గౌరవించడం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికి ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితరుల ఫొటోలనూ ఇవ్వడం లేదు. వారికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇస్తోంది.

తెలుగునూ అర్థం చేసుకుంటుంది..

వాట్సప్‌ ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవడం చాలా సులభం. స్నేహితులతో ఎలా చాటింగ్‌ చేస్తామో ఇదీ అలాగే. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. తర్వాత ప్రశ్నలు కొనసాగించవచ్చు. అందుకు అనుగుణంగా సమాధానాలు వస్తుంటాయి. హిస్టరీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో క్లిష్టమైన అంశాలను వివరించడం దగ్గర నుంచి.. మెయిల్స్, లెటర్స్‌ రాయడం వరకు వాట్సప్‌ ఏఐ మనకు సాయం చేస్తుంది. అనువాద ప్రక్రియలో మనకు తోడ్పాటునందిస్తుంది. మనం ఏదైనా చికాకులో ఉంటే ఒక జోక్‌ వేసి నవ్వించే నేర్పు దీనికి ఉంటుంది. కాలక్షేపానికి వర్డ్‌ పజిల్స్‌ను తయారు చేసి మనకు సంధిస్తుంది. వాట్సప్‌ చాట్‌బాట్‌ మీ ప్రశ్నను తెలుగులో అర్థం చేసుకున్నా.. దాని సమాధానం ఇంగ్లిష్‌లోనే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇందులోని సమాచారాన్ని నేరుగా మెయిల్‌ లేదా ఇతర వేదికలకు పంపుకోవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.


టెక్ట్స్‌ ఇస్తే ఫొటో రెడీ.. 

సముద్రంపై ఎగిరే రెక్కల గుర్రం ఫొటో కావాలని ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు వాట్సప్‌ ఏఐ రూపొందించిన చిత్రం

దాహరణకు సముద్రంపై ఎగిరే రెక్కల గుర్రం ఫొటో సృష్టించాలనే ఆలోచన ఉందనుకోండి.. దాన్ని కీ బోర్డ్‌ టైప్‌ ద్వారా లేదా వాయిస్‌ టైపింగ్‌ ద్వారా ఏఐకు వివరించాలి. అది మన సూచనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అప్పటికప్పుడే చిత్రాన్ని సృష్టిస్తుంది. కావాలంటే దానికి యానిమేషన్‌ కూడా జోడిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని