ఇక భారత్‌ ప్రయాణం కొత్త పార్లమెంట్‌లో.. పాత భవనం నుంచి తరలివెళ్లిన ఎంపీలు

స్వతంత్ర భారత్‌కు చెందిన ఎన్నో కీలక ఘట్టాలకు పార్లమెంట్ పాత భవనం(Old Parliament building) సాక్షిగా మిగిలిపోయింది. అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలను మంగళవారం కొత్త పార్లమెంట్‌కు తరలించారు.

Updated : 19 Sep 2023 16:00 IST

దిల్లీ :  పార్లమెంట్ నూతన భవనంలో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. మంగళవారం పార్లమెంట్‌ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయ సభ సభ్యులు కొత్త పార్లమెంట్‌(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మంత్రులు, ఎంపీలు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ఆయన్ను అనుసరించారు. అలాగే సెంట్రల్‌ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. లోపలికి వెళ్లిన ప్రధాని కొత్త భవనాన్ని తరచి చూశారు. 

ప్రారంభమైన పార్లమెంట్‌ కార్యకలాపాలు..

సభలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మాట్లాడిన తర్వాత.. ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. ‘కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకం. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలం. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకొని వెళ్లాలి. చంద్రయాన్‌ 3 విజయం దేశవాసులను గర్వపడేలా చేసింది. జీ20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్ఠను పెంచింది. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వాలకు కలబోత ఈ కొత్త భవనం’ అని ఈ సందర్బంగా మోదీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని