Om Birla: మైక్‌ కట్‌ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా

ప్రతిపక్ష నేతల మైక్‌లను సభాపతి కట్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు.

Published : 01 Jul 2024 17:20 IST

దిల్లీ: కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టిన సమయాల్లో సభాపతి సూచనల మేరకు ప్రిసైడింగ్ అధికారులు ప్రతిపక్ష నేతల మైక్‌లను కట్‌ (Mic Muted Charge) చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైక్‌ను ఆపరేట్‌ చేసేందుకు వాళ్ల దగ్గర ఎలాంటి రిమోట్‌ కంట్రోల్స్‌ ఉండవని స్పష్టం చేశారు. ఇది సభాపతి గౌరవానికి సంబంధించిన విషయమని, ఇలాంటి అంశాలపై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. అనవసర విషయాలతో సమయం వృథా చేయకుండా సభ్యులంతా ప్రజల సమస్యలపై మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘‘ సభాపతి స్థానంలో ఉన్న ఎవరైనా కేవలం రూలింగ్‌ లేదా ఆదేశాలు మాత్రమే ఇవ్వగలరు. సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తూ సభ్యుడి పేరు పిలిచినప్పుడు, సభాపతి ఆదేశాల మేరకు అక్కడున్న సిబ్బంది సంబంధిత వ్యక్తికి మైక్‌ కనెక్షన్‌ ఇస్తారు. అంతే తప్ప చైర్‌లో కూర్చున్న వ్యక్తికి గానీ, ప్రిసైడింగ్‌ అధికారులకుగానీ మైక్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఉండదు.’’ అని ఓం బిర్లా స్పష్టం చేశారు. సభాపతి స్థానంలో స్పీకర్‌ లేనప్పుడు సభను సజావుగా నడిపించేందుకు ఏర్పాటు చేసిన స్పీకర్‌ ప్యానెల్‌లో అన్ని పార్టీల సభ్యులు ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ ఇది స్పీకర్‌ స్థానానికి ఉన్న గౌరవానికి సంబంధించిన అంశం. కనీసం ప్యానెల్‌లో ఉన్నవారైనా ఇలాంటి ఆరోపణలు చేయకూడదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. సురేశ్‌ కూడా స్పీకర్‌ ప్యానెల్‌లో ఉన్నారు. మైక్‌ను సభాపతి కంట్రోల్‌ చేయగలరో? లేదో? ఆయనైనా చెప్పాలి’’ అని ఓం బిర్లా వ్యాఖ్యానించారు.

శుక్రవారం లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ నీట్‌ పరీక్ష (NEET UG 2024) నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో తనను మాట్లాడనీయకుండా మైక్‌ కట్‌ చేశారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ స్పందించారు. గతంలో అలాంటి ఏర్పాటు ఉండేదని, ఇప్పుడు మాత్రం మైక్రోఫోన్‌ను ఆపరేట్‌ చేసే వెసులుబాటు సభాపతికి లేదని చెప్పారు. చైర్‌ ఆదేశాల మేరకు పార్లమెంట్‌ సిబ్బంది దానిని ఆపరేట్‌ చేస్తారని వివరించారు. తాజాగా ప్రతిపక్షాలు మరోసారి అదే వాదన తీసుకురావడంతో ఒకింత అసహనానికి గురవుతూనే స్పష్టత ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని