Mumbai: 14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..

ముంబయిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న హోర్డింగ్‌ను అక్రమంగా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.  

Updated : 15 May 2024 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి (Mumbai)లోని ఘాట్‌కోపర్‌ వద్ద హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలైన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బిల్‌బోర్డు యజమాని భవేశ్‌ భిండే అత్యాశ కూడా ఈ ప్రమాదానికి కారణంగా నిలిచింది. 40X40 ఉండాల్సిన ఈ ఇనుప హోర్డింగ్‌ను ఏకంగా 120X120 సైజులో చేయించారు. ఇది లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు ఎక్కే సైజని ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. ప్రమాదానికి గురైన ఈ హోర్డింగ్‌కు అసలు అనుమతే లేవని అధికారులు చెబుతున్నారు. దానిని ఏర్పాటుచేసేందుకు కొన్ని చెట్లను కూడా నరికినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  అయితే ఆ స్థలం రైల్వే శాఖది కావడంతో దానికి అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ నుంచి అనుమతి తెచ్చుకొన్నట్లు ‘ఇగో మీడియా’ చెబుతోంది. దీనికి బీఎంసీ 14 నెలల క్రితమే తొలి నోటీసు జారీ చేసింది. 

ప్రస్తుతం భవేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి అతడికి కేసులు కొత్తేమీ కాదు. 2009లో ములుంద్‌ నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలిచాడు. ఆ సమయంలో 23 కేసులు తనపై ఉన్నట్లు అతడు ప్రమాణపత్రంలో పేర్కొన్నాడు. వీటిల్లో బీఎంసీ చట్ట ఉల్లంఘన, చెక్‌ బౌన్స్‌ కేసులు ఉన్నాయి. ఇక గతేడాది జనవరిలో అతడిపై రేప్‌ కేసు కూడా నమోదైంది. 

అతడు హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసేందుకు రైల్వేలు, ముంబయి కార్పొరేషన్‌ నుంచి పలు కాంట్రాక్టులు సంపాదించినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్న అతడు క్రమంగా చట్టాలను ఉల్లంఘించడం మొదలుపెట్టాడు. వృక్షాలకు విషం పెట్టడం, నరికివేయడం వంటి కేసుల్లో అతడు, ఇగో మీడియా సంస్థ ఉద్యోగులు ఉన్నారు. ఇక కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని