Surgery: కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!

ఠాణెలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలుడి కాలుకు బదులు అతడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు.

Updated : 29 Jun 2024 15:59 IST

ఠాణె: కాలుకు గాయమైన తొమ్మిదేళ్ల బాలుడ్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గాయమైన చోట కాకుండా బాలుడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) ఠాణె (Thane) జిల్లా శహాపుర్‌లో చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని ఠాణె ఆరోగ్య అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు కూడా విచారణ చేపట్టారు.

బాలుడి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటుండగా బాలుడి కాలుకి (Leg Injury) గాయమైంది. అది తగ్గకపోవడంతో జూన్‌ 15న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స అవసరమని చెప్పిన వైద్యులు..  తాజాగా కాలుకు కాకుండా బాలుడి మర్మావయవాలకు సర్జరీ చేశారు. గమనించిన తల్లిదండ్రులు వారిని నిలదీయంతో అప్రమత్తమై.. వెంటనే కాలుకు కూడా ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. వారి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై జిల్లా సివిల్ సర్జన్‌ డాక్టర్‌ కైలాస్‌ పవార్‌ స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కాగా, బాలుడి కాలుకు గాయమవ్వడంతోపాటు మర్మాంగంలోనూ సమస్య ఉందని, అందుకే రెండు సర్జరీలు చేశామని ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్ గజేంద్ర పవార్‌ మీడియాకు వివరించారు. దీని గురించి బాలుడి తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయాలని వైద్యులకు చెప్పానని, అయితే వాళ్లు చెప్పడం మర్చిపోయి ఉండొచ్చని, లేదంటే బాధితుడి బంధువులెవరికైనా చెప్పి ఉండొచ్చని అన్నారు. రెండు శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో వైద్యుల తప్పేమీ లేదన్నారు. అయితే, తల్లిదండ్రులకు విషయం అర్థమయ్యేలా చెప్పకపోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. అదే రోజు దాదాపు బాలుడి వయసున్న మరో ఇద్దరికి కూడా అదే సర్జరీ చేసినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని