Kulguru: వైస్‌ ఛాన్సలర్‌ కాదు.. ఇకపై ‘కులగురు’.. మధ్యప్రదేశ్‌ నిర్ణయం!

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్‌ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Published : 01 Jul 2024 21:51 IST

భోపాల్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ‘వైస్‌ ఛాన్సలర్‌’ పదవి పేరును ‘కులగురు (Kulguru)’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలను ఇకపై కులగురువులుగా సంబోధించనున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో గురుపౌర్ణమి వేళ ఈ నిర్ణయం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. రాష్ట్రంలోని మంత్రులు ఇకపై సొంతంగా ఆదాయపు పన్ను చెల్లించే ప్రతిపాదనకూ క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది.

మంత్రులూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే..!

‘‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ‘కులపతి’ భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా మారింది’ అని సీఎం యాదవ్‌ తెలిపారు. ‘కులగురు’ ప్రతిపాదనపై ఇతర రాష్ట్రాలూ ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యాదవ్.. వీసీ హోదాను ‘కులగురు’గా మార్చాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బోరుబావులను ఓపెన్‌గా వదిలేస్తే జరిమానా, ఆవులను కబేళాలకు తరలించే వాహనాల సీజ్‌ వంటి ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని