RajyaSabha: ధన్‌ఖడ్‌, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!

రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి.

Updated : 01 Jul 2024 14:51 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడం సాధారణంగా చూస్తుంటాం. ఈక్రమంలో రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar), కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ల మధ్య వాడీవేడి సంభాషణ జరిగిన రెండురోజులకే వారి మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణతో సభలో నవ్వులు విరిసాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి నిలబడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధన్‌ఖడ్‌ స్పందిస్తూ.. ‘‘సభలో ప్రసంగించేటప్పుడు మీరు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు కూర్చొని మాట్లాడవచ్చు. ఆ నిర్ణయం మీదే’’ అని బదులిచ్చారు. కూర్చొని చేసే ప్రసంగం, నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. విపక్ష నేత మాటలతో ఛైర్మన్‌ కూడా ఏకీభవించడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంపై టీమ్‌ఇండియాకు అభినందనలు

‘‘ఈ విషయంలో నేను మీకు సాయం చేస్తాను’’ అని ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. ఛైర్మన్‌ కూడా కొన్ని సందర్భాల్లో తమకు సాయం చేశారని.. దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని ఖర్గే పేర్కొనడంతో  సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ‘‘తమ నవ్వులతో సభ్యులు నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఛైర్మన్‌ కూడా తోడయ్యారు’’ అని ఖర్గే మళ్లీ వ్యాఖ్యానించారు. తాను కూడా ఒక్కోసారి అలాగే మాట్లాడతానంటూ ధన్‌ఖడ్‌ చమత్కరించారు. ఇలా ధన్‌ఖడ్-ఖర్గేల మధ్య కొనసాగిన సంభాషణలతో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కూడా చిరునవ్వులు చిందించారు.

ఇది నేరమా..?

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సభలో వాతావరణం వేడెక్కింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. యూనివర్సిటీలు, ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో వైస్‌ ఛాన్సలర్లు, ప్రొఫెసర్ల నియామకాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉంటోందన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ‘‘ఈ సంస్థ దేశ అభివృద్ధికి కృషి చేస్తోంది. దేశ ప్రగతి కోసం శ్రమిస్తున్న ఎంతోమంది గొప్పవారు దీనిలో ఉన్నారు. అలాంటివారు ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమవడం నేరమా?’’ అని ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని