Emergency: తొలి ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’పై స్పీకర్‌ వ్యాఖ్యలు.. మోదీ ఏమన్నారంటే..?

Emergency: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేడు సభలో చదివి వినిపించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.

Updated : 26 Jun 2024 16:35 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా (Om Birla) సభలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ సభలో మౌనం పాటించారు. అయితే, స్పీకర్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

సభాపతిగా (Lok Sabha Speaker) ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’పై తీసుకొచ్చిన తీర్మానాన్ని చదవి వినిపించారు. ‘‘1975, జూన్‌ 25 మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (Emergency)ని విధించారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ప్రపంచంలోనే మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు సాధించాం. ఆ ప్రజాస్వామ్య విలువలు, చర్చలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ, నాటి ప్రధాని (ఇందిరాగాంధీ) నియంతృత్వాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించారు. యావత్‌ దేశం కారాగారంగా మారిపోయింది’’ అని స్పీకర్‌ గుర్తుచేశారు.

నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని తాము అభినందిస్తున్నామని ఓం బిర్లా (Om Birla) అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. అయితే, స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.

నేటి తరం తెలుసుకోవాలి: మోదీ

స్పీకర్‌ ప్రసంగంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎమర్జెన్సీని స్పీకర్‌ తీవ్రంగా ఖండించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి అప్పటి ప్రభుత్వం సాగించిన అన్యాయాలను ఆయన ఎత్తిచూపారు. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించారు. దాని గురించి నేటి తరం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. ప్రజాభిప్రాయాన్ని అణచివేసి, సంస్థలు నాశనం చేసినప్పుడు సమాజం ఎలా ఉంటుందో చెప్పేందుకు నాటి రోజులే సరైన ఉదాహరణ. నియంతృత్వం ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి తెలుసుకోవచ్చు’’ అని మోదీ ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని