CM Siddaramaiah: కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!

సీఎం పదవి నుంచి వైదొలగి డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేయాలని వక్కలిగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి సిద్ధరామయ్యకు ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 01 Jul 2024 19:41 IST

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమయ్యింది. సీఎం పదవి నుంచి వైదొలిగి.. డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేయాలని వక్కలిగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. నాయకత్వ మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో ఉందని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు.

‘‘స్వామీజీ చెప్పిన దానిపై నేను వ్యాఖ్యానించను. మాది జాతీయ పార్టీ. అక్కడ అధిష్ఠానం ఉంది. ఇది బహిరంగంగా చర్చించే విషయం కాదు. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉండాలి’’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. వొక్కలిగ వర్గానికి చెందిన పీఠాధిపతి చంద్రశేఖర స్వామి చేసిన విజ్ఞప్తిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు.

‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్‌ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్‌ వక్కలిగ వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, మరిన్ని ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించి లింగాయత్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి కేటాయించాలని సీఎంకు సన్నిహితంగా ఉన్న కొందరు మంత్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలూ వచ్చాయి. శివకుమార్‌ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాననే బహిరంగంగానే చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎక్కువ సీట్లలో గెలిస్తే తన పదవికి బలం చేకూరుతుందని చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని