Lalu Prasad Yadav: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మమ్మల్ని జైల్లో వేయించారేగానీ..: లాలూ ప్రసాద్‌ యాదవ్‌

గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ నేతల నోట ఎమర్జెన్సీ పదం విరివిగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ (Lalu Prasad Yadav) సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.  

Published : 29 Jun 2024 16:26 IST

పట్నా: దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ (Emergency)పై ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దానికి ముందు ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) స్పందించారు. నాడు ఇందిర తమను జైల్లో పెట్టించారు కానీ.. ఎన్నడూ వేధించలేదని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ(Emergency)కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఏర్పాటు చేసిన కమిటీకి  కన్వీనర్‌గా పనిచేశాను. అప్పుడు మెయింటినెన్స్‌ ఆఫ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (MISA) కింద జైల్లో పెట్టారు. 15 నెలలు జైల్లో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర కేంద్రమంత్రుల గురించి మేం వినలేదు. ఇందిర ఎంతోమందిని జైల్లో వేయించారు కానీ.. ఎవరినీ వేధించలేదు. ఆమె కానీ, ప్రభుత్వంలోని మంత్రులు కానీ మమ్మల్ని దేశ వ్యతిరేకులని అనలేదు. మన ప్రజాస్వామ్యంపై 1975 నాటి స్థితి ఒక మరకలాంటిదే. కానీ, 2024లో విపక్షాలను గౌరవించని వారిని ఎవరూ మర్చిపోకూడదు’’ అని లాలూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. "The Sangh Silence in 1975" పేరిట ఒక కథనాన్ని షేర్ చేశారు.

‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్‌ పవార్‌

 ఇటీవల పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..‘‘ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది’’ అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ఇటీవల కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని