Bihar Bridge Collapse: అందుకే బిహార్‌లో వరుసగా బ్రిడ్జ్‌లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం

బిహార్‌ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. 

Published : 05 Jul 2024 13:50 IST

పట్నా: బిహార్‌లో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయి. 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం (Bihar Bridge Collapse) చర్చనీయాంశంగా మారింది. దీనికి కేంద్ర మంత్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది.

‘‘ఇది రుతుపవనాల సమయం. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బ్రిడ్జ్‌లు కూలడానికి కారణం అదే. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని మంత్రి వెల్లడించారు.

ఇప్పటివరకు శివన్‌, సరన్‌, మధుబాణి, అరారియా, ఈస్ట్‌ చంపారన్‌, కృష్ణగంజ్‌ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శల వేళ.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే నిర్వహించి, తగిన మరమ్మతులు చేయాలని నీతీశ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం చౌదరి తెలిపారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సూచించినట్లు తెలిపారు.

భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ మాట్లాడుతూ.. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారని తెలిపారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని