Hemant Soren: భూ కుంభకోణం కేసు.. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌

Hemant Soren: భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 28 Jun 2024 12:31 IST

రాంచీ: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్‌ (Bail) మంజూరుచేసింది. ‘‘ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఏ నేరానికి పాల్పడలేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్‌ ఇస్తున్నాం’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

భూ కుంభకోణానికి (Land Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.

ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ..: శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

రాంచీలో 8.86 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) అరెస్టయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి.. అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం సోరెన్‌ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. చివరకు నేడు ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని