Jacqueline Fernandez: ఆర్థిక నేరగాడు సుకేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న జాక్వెలిన్‌!

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గురించి ఆసక్తిరమైన విషయాలు బయటపడ్డాయి..........

Published : 18 Sep 2022 01:44 IST

వెలుగులోకి ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఆమె విచారణకు హాజరయ్యారు కూడా.  ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిందని.. అతడి నుంచి విలువైన బహుమతులు అందుకుందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. కాగా జాక్వెలిన్‌ గురించి ఆసక్తిరమైన విషయాలు బయటపడ్డాయి. పూర్తిగా సుకేశ్‌ మాయలో పడిపోయిన ఈ నటి ఒకానొక సమయంలో అతడిని పెళ్లి చేసుకోవాలని భావించిందట! సుకేశే తన కలల రాకుమారుడని, అతడిని వివాహం చేసుకోవాలనుకుందని జాక్వెలిన్ సన్నిహితులు కొందరు వెల్లడించారు.

జాక్వెలిన్‌ను ఆకట్టుకునేందుకు సుకేశ్ ఆమెకు రూ.10కోట్ల విలువచేసే అత్యంత ఖరీదైన బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, మినీకూపర్ వంటివి కానుకలుగా అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆశగా చూపి అతడు నటిని బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. సుకేశ్‌తో జాక్వెలిన్ మానసికంగా దగ్గరైందని, అయితే అతగాడి మోసాలకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని చూసి జాక్వెలిన్‌ నివ్వెరపోయినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. సుకేశ్‌ను తనకు పరిచయం చేసిన పింకీ ఇరానీని ఇదే విషయంపై నటి ప్రశ్నించగా.. ఆమె కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. సుకేశ్‌ను జాక్వెలిన్‌కు పరిచయం చేసేందుకు పింకీ ఇరానీ భారీగా డబ్బు తీసుకున్నారని కూడా వారు తెలిపారు.

మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ను బుధవారం దిల్లీ పోలీసులు విచారించారు. ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దాదాపు 8 గంటల పాటు ఆమెను  విచారించారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీసినట్టు సమాచారం. దీనికి సంబంధించి గతంలోనే దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ.. ఇటీవల దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లోనూ జాక్వెలిన్‌ పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

అయితే, సుకేశ్ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినా అతడితో సాన్నిహిత్యం కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, సుకేశ్‌ అరెస్టయిన తర్వాత జాక్వెలిన్‌ సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ఈడీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని