PM Modi: అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ

మోదీ సర్కార్‌ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు.

Updated : 03 Jul 2024 19:40 IST

దిల్లీ: దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనం, అవినీతి భూతాన్ని నాశనం చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాజ్యసభలో ప్రకటించారు. అందుకోసం తమ సర్కార్‌ కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటి నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరని హెచ్చరించారు.

తమపై మోదీ సర్కార్‌ ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తుండడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘దర్యాప్తు సంస్థలు నిజాయితీగా పని చేస్తాయి. ఏ అవినీతిపరుడు చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇది మోదీ గ్యారంటీ. అవినీతి, నల్లధనాన్ని నిలువరించేందుకు కఠినచర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు తెలియజేస్తున్నా. వాటి చర్యల్లో  మా సర్కార్‌కు ఎలాంటి పాత్ర లేదు’’ అని స్పష్టం చేశారు.  

నాడు ఆప్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు.. 

ఈ సందర్భంగా దిల్లీ మద్యం కుంభకోణాన్ని ప్రస్తావించిన మోదీ.. ఆమ్‌ ఆద్మీ పార్టీతో సహా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘ఆప్‌ అవినీతికి పాల్పడింది. మద్యం కుంభకోణానికి తెర తీసింది. పలు కుంభకోణాలతో పాటు మరెన్నో దుశ్చర్యలకు పాల్పడింది. ఆప్‌ చర్యలపై కాంగ్రెస్‌ కూడా ఫిర్యాదు చేసింది. కానీ, ఇప్పుడు ఆప్‌పై చర్యలు తీసుకుంటే మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి’’ అని ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు.

జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?

అవన్నీ సత్యాలా.. అసత్యాలా?

నాడు ఆప్‌ కుంభకోణాలకు సంబంధించిన సాక్ష్యాలను కాంగ్రెస్‌ మీడియా ముందు పెట్టిందని గుర్తు చేశారు. ‘‘ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. ఆప్‌పై గతంలో హస్తం పార్టీ చెప్పినవి సత్యాలా లేక అసత్యాలా?దీనిపై కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలి’’ అని ప్రధాని డిమాండ్‌ చేశారు. అవినీతి నిర్మూలనే ఎన్డీఏ లక్ష్యమని.. ఎన్నికల్లో గెలుపోటములు తమకు ముఖ్యం కాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని