Viral post: అదొక భయానక అనుభవం..ఎయిర్‌లైన్స్‌పై ప్రయాణికుడి పోస్టు

విస్తారా ఎయిర్‌లైన్స్‌ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 03 Jul 2024 17:20 IST

బెంగళూరు: బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త విస్తారా ఎయిర్‌లైన్స్‌(Vistara Airlines)పై అసహనం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ శర్మ(Siddharth Sharma) అనే వ్యాపారవేత్త తాను పారిస్‌(Paris) నుంచి భారత్‌(India)కు విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. 

‘‘పారిస్‌ నుంచి ఇండియా రావడానికి విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఆ విమానాన్ని రద్దు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విమానం ఆలస్యంగా వచ్చింది. ఇండియాకు చేరుకున్న తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఆలస్యంగా వచ్చింది. అన్నిటికీ మించి నా సామాన్లు ఎక్కడో పోయాయి. మీ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించినందుకు ఇది నాకో భయానక అనుభవం’’ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘మీరు విస్తారాలో ఎవరినైనా విసిగించారా..అందుకే ఇలా చేశారేమో’ అంటూ సరదాగా రాసుకొచ్చారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ ‘విమానాశ్రయంలో లగేజ్‌ పోతే దానిని తిరిగి తీసుకోవడనికి చాలా ప్రాసెస్‌ చెయ్యాల్సి ఉంటుంది. నేను గత సంవత్సరం ఎయిర్ అరేబియాలో ప్రయాణిస్తూ 3 బ్యాగులను పోగొట్టుకున్నాను. కేసు కూడా నమోదు చేశాను కానీ ఎటువంటి స్పందన లేదు. దీనిపై లీగల్ నోటీసు కూడా వేశాను’ అని వాపోయారు. ‘ఎయిర్ ఇండియాను విస్తారాగా మారుస్తారని అనుకున్నాం. కానీ వారు విస్తారానే ఎయిర్ ఇండియాగా మార్చేశారు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. 

పోస్ట్‌ వైరల్‌గా మారడంతో విస్తారా ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ ‘‘సిద్ధార్థ్ మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మీరు పోగొట్టుకున్న సామాను భద్రంగా ఉంది. దానిని 24గంటల్లోపు డెలివరీ ఏజెంట్లు మీకు అప్పగిస్తారు. మా సేవలను మరింతగా మెరుగుపరుచుకుంటాము’’ అంటూ పోస్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని