viral post: ‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్‌ వైరల్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 03 Jul 2024 19:43 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: విదేశాల్లోని రెస్టారంట్లలో పలు భారతీయ వంటకాలకు రకరకాల పేర్లు పెట్టి అమ్ముతుంటారు. విదేశాల్లో ఉండే భారతీయులకు తరచూ ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా(Harsh Goenka)తనకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన వెళ్లిన ఓ హోటల్‌లోని మెనూ ఫొటోను షేర్‌ చేశారు. అందులో దక్షిణ భారత వంటకాలకు ఆంగ్లంలో విచిత్రమైన పేర్లు పెట్టి అమ్ముతున్నారు. సాంబార్‌ వడ పేరును ‘డంక్డ్ డోనట్’, ఇడ్లీని ‘డంక్డ్ రైస్ కేక్’,  దోశను ‘నేకెడ్ క్రీప్’గా మార్చేశారు.

దీనిపై ఆయన స్పందిస్తూ “వడ, ఇడ్లీ, దోశలు ఇంత ఫ్యాన్సీగా మారతాయని ఎవరికి తెలుసు?’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ మెనూలోని వంటకాల ధరలు కూడా అధికంగా ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెనూలో ఒక ప్లేట్ సాంబార్ వడ ధర 16 డాలర్లు (సుమారు రూ. 1300), ఇడ్లీకి 15 డాలర్లు (సుమారు రూ. 1200), దోశకు 17.5 డాలర్లు (సుమారు రూ. 1400)గా ఉన్నాయి.

ఈ పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన ప్రజలు మన వంటల పేర్లను నామోషీగా భావిస్తూ వాటికి ఫ్యాన్సీ పేర్లు పెట్టుకుంటున్నారు’ అంటూ పేర్కొన్నారు. ‘‘భారతీయ వంటకాలకు వేరే పేర్లు పెట్టలేము. వాటి స్థానం వాటిదే..పానీ పూరీని వాటర్‌ బాల్స్‌ అంటే వినగలమా?అనేక విదేశీ హోటల్స్‌ స్థానిక జనాభాకు అనుగుణంగా వంటకాల పేర్లను మారుస్తుంటాయి’’ అంటూ మరొకరు స్పందించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ “ఈ రోజుల్లో యువత మన దేశీయ రుచులను ఇష్టపడట్లేదు. అందుకే తాను వండే పదార్థాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి పిల్లలకు ఇవ్వమని నా భార్యకు చెప్పాను. అలా అయినా మా పిల్లలు వాటిని తింటారేమో అని?’’ అంటూ రాసుకొచ్చారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని