Khaidi No 6106: దర్శన్‌ ‘ఖైదీ నంబర్‌’తో ఫొటో షూట్‌.. పేరెంట్స్‌పై కేసు!

విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కేటాయించిన ‘ఖైదీ నంబర్‌’తో ఫొటో షూట్‌ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది.

Published : 04 Jul 2024 00:03 IST

బెంగళూరు: అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌ విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, జైల్లో ఆయనకు కేటాయించిన ‘ఖైదీ నంబర్‌’ తాజాగా చర్చనీయాంశమయ్యింది. ఆ నంబర్‌తో కూడిన ఓ డ్రెస్‌ వేసి తమ చిన్నారికి ఫొటో షూట్‌ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది. దీన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించడంతో ఆ తల్లిదండ్రులపై కేసు నమోదైంది.

కర్ణాటకకు చెందినట్లుగా భావిస్తోన్న ఓ జంట.. తమ చిన్నారికి ఇటీవల ఫొటో షూట్‌ నిర్వహించారు. చిన్నారికి తెలుపు దుస్తులు వేయగా.. చొక్కాతో పాటు ఆ పక్కన ‘ఖైదీ నంబర్‌ 6106’ అని రాశారు. ఆ పక్కన సంకెళ్ల బొమ్మ కూడా వేశారు. ఇవన్నీ జైల్లో ఉన్న దర్శన్‌ను అనుకరిస్తూ చిత్రీకరించినట్లు కనిపించింది. ఈ ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ దృష్టికి వెళ్లడంతో.. దీనిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. అంతేకాకుండా చిన్నారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో గుర్తించాలని పోలీసులను ఆదేశించింది. ఈ తరహా ఫొటో షూట్‌ ఖండించదగినదని, బాలల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్‌ సభ్యుడు శశిధర్‌ కొసాంబే పేర్కొన్నారు. ఫొటో షూట్‌ చేసిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరోవైపు, జైల్లో ఉన్న దర్శన్‌ ‘ఖైదీ నంబర్‌ 6106’ సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులు దానిని టాటూగా వేసుకోవడంతోపాటు ఈ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌ను పలువురు ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో చిన్నారికి ఫొటో షూట్‌ చేయడం వంటి పరిణామాలపై సామాజిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌, నటి పవిత్రా గౌడతో సహా మొత్తం 17 మంది అరెస్టైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని