Puri Rath Yatra: పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు

 పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

Updated : 30 Jun 2024 18:43 IST

దిల్లీ: పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర (Puri Rath Yatra) మహోత్సవాలు జులై 6 నుంచి జులై 19 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 315 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ (indian Railway) నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి (Odisha CM Mohan Charan Majhi), డిప్యూటీ సీఎంలు కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాచారమిచ్చారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్; గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సంధ్యా దర్శన్‌, బహుదా యాత్రకు వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వేడుకలు కొనసాగినన్నాళ్లు భక్తులతో పూరీ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారే అవకాశమున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఫకువాల్‌ తెలిపారు. రైల్వేశాఖ తరఫున సుమారు 15 వేల మంది భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో చేరుకుంటారు. ఆషాడ శుక్లపక్షమి హరిశయన ఏకాదశి రోజున నిర్వహించే అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. ఆ రోజున పెద్దమొత్తంలో రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని