Vande Bharat Sleeper: తొలి వందే భారత్‌ స్లీపర్‌.. వచ్చేది ఆరోజేనా..?

దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలును త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Updated : 25 Jun 2024 16:01 IST

దిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైలు (Vande Bharat sleeper train) త్వరలో పట్టాలెక్కనుంది. స్లీపర్‌ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వందే భారత్‌ రైళ్లు ఛైర్‌కార్‌ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాయి. ఈనేపథ్యంలో స్లీపర్‌ ట్రైన్‌ను మరో రెండు నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) స్లీపర్‌ రైలు పనులను పర్యవేక్షించడానికి బెంగళూరు(Bengaluru) వెళ్లారు. వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలు దిల్లీ, ముంబయి రైల్వే మార్గంలో నడుస్తుందని, రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్లీపర్‌ ట్రైన్‌ దిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబయి చేరుకుంటుందని తెలిపాయి. 

త్వరలో పట్టాలెక్కనున్న ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ(SLR) కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల అనంతరం  క్రమంగా గంటకు 160-220 కి.మీ.లకు పెంచనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని