Lok Sabha Election Results: జైలు నుంచే ఎంపీగా గెలుపు.. లోక్‌సభకు వెళ్లొచ్చా..?

Lok Sabha Election Results: ఉగ్ర అభియోగాలపై జైలులో ఉన్న ఇద్దరు తాజా ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. మరి వారు లోక్‌సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

Published : 05 Jun 2024 17:28 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల (Lok Sabha Election Results)తో 18వ లోక్‌సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైంది. వీరిలో రాజకీయ ఉద్ధండులు, తొలిసారి ఎన్నికైనవారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరందరిని పక్కనబెడితే కొత్తగా ఎన్నికైన వారిలో ఇద్దరి గెలుపు ఆశ్చర్యపర్చింది. అవును మరి.. వాళ్లు జైలు నుంచే ఈ ఎన్నికల్లో పోటీ చేయడమే గాక.. విజయం సొంతం చేసుకున్నారు. వారే అమృత్‌పాల్ సింగ్‌ (Amritpal Singh), ఇంజినీర్‌ రషీద్‌. మరి వారు లోక్‌సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం..!

పంజాబ్‌ (Punjab)లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ (Engineer Rashid) తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ (Lok sabha) మాజీ సెక్రటరీ జనరల్‌, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు.

‘‘ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత అవశ్యం. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ్యుడిగా ప్రమాణం (Oath Taking) చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలి’’ అని ఆచారి వెల్లడించారు.

అయితే, జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్‌ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు.

స్వతంత్రులుగా పోటీ చేసి..

అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు, వేర్పాటువాది అమృత్‌పాల్‌ (Amritpal Singh) పేరు దేశంలో మార్మోగింది. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖడూర్‌సాహిబ్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం అందుకున్నారు.

ఇక, ఇంజినీర్‌ రషీద్‌గా గుర్తింపు పొందిన షేక్‌ అబ్దుల్‌ రషీద్‌.. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసి ఏకంగా మాజీ సీఎంనే ఓడించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలుశిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని