pm modi: ‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 30 Jun 2024 14:48 IST

దిల్లీ: ప్రజలకు సందేశమివ్వడంతో పాటు.. వారితో మమేకమయ్యేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ఏర్పాటు చేసే ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) కార్యక్రమాన్ని ప్రధాని మోదీ (Narendra Modi ) పునఃప్రారంభించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కొత్త ప్రచారానికి పిలుపునిచ్చారు.

ఉత్తర భారతంలో భారీవర్షాలు

2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలుగా మోదీ పేర్కొన్నారు. ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదని, 65 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని అన్నారు. ఎన్నికల్లో ఎన్‌డీఏ (NDA) కూటమిని తిరిగి ఎంచుకున్నందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియపై తనకున్న విశ్వాసాన్ని ప్రజలు నిలబెట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’’ పేరుతో తీసుకొచ్చిన కొత్త ప్రచారం గురించి ప్రస్తావించారు. ‘‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి ’’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తారని దేశం ఆశిస్తోందన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ‘‘చీర్‌4భారత్‌’’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని