Indian Army and Navy: దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు

బాల్య స్నేహితులిద్దరు దేశంలోని అత్యున్నత అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అరుదైన ఘటన చోటు చేసుకొంది.    

Published : 30 Jun 2024 14:03 IST

దిల్లీ: బాల్య స్నేహితులిద్దరు దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ(Army), నేవీ(Navy) అధిపతులు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

దినేష్‌ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రేవాలోని సైనిక్ స్కూల్‌ (Rewa Sainik School)లో కలిసి చదువుకున్నారు. నాటి నుంచే వారిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది. ప్రస్తుతం వారు వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుతుంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్‌కు దక్కుతుంది’’ అని అభినందించారు. 

1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు.

జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ

ఆర్మీ చీఫ్‌గా రెండేళ్లు దేశానికి సేవలందించిన జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన్ను గార్డ్ ఆఫ్ హానర్‌తో అధికారులు గౌరవించారు. పాండే 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. వాస్తవానికి ఆయన మే 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును ఒక నెల పొడిగించింది. దీంతో జూన్‌ 30న పదవీ విరమణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు