Shashi Tharoor: ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ..: శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor: దేశంలో అత్యయిక స్థితి విధించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అది ప్రజాస్వామ్య వ్యతిరేకమే గానీ.. రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.

Published : 28 Jun 2024 10:51 IST

దిల్లీ: దాదాపు ఐదు దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశం ఇప్పుడు లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఈ ప్రస్తావన తేవడం, స్పీకర్‌ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే అయినప్పటికీ రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్‌ అత్యయిక స్థితిపై జరుగుతున్న వివాదం గురించి ప్రస్తావించారు. ‘‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఆ తర్వాత దాన్ని తొలగించినప్పటికీ అప్పట్లో ఆ నిబంధన ఉండేది’’ అని థరూర్‌ వ్యాఖ్యానించారు.

ఈసందర్భంగా మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదు. నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్‌ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలి’’ అని థరూర్‌ అన్నారు.

మోదీపైనే సంసద్‌ టీవీ ఫోకస్‌: కాంగ్రెస్‌

‘జై సంవిధాన్‌’ అని కూడా అనలేమా ?: ప్రియాంక

కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎన్నికైన శశిథరూర్‌ లోక్‌సభ సభ్యుడిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం పూర్తయిన తర్వాత ఆయన ‘జై హింద్‌, జై సంవిధాన్‌’ అని నినాదం చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా ‘జై సంవిధాన్‌’ అని నినదించారు. ఇలా అనడంపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలుపగా.. విపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ నాయకురాలు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘అధికార పార్టీకి చెందిన సభ్యులు అనుచిత పదజాలాన్ని ఉపయోగించినా.. రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ప్రతిపక్ష నేతలు జై సంవిధాన్‌ అని చెబితే మాత్రం వద్దంటున్నారు. మన రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని