New Criminal Laws: అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!

కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పునకు కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Published : 01 Jul 2024 18:13 IST

దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు నేటి (జులై 1) నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిపై న్యాయ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేర న్యాయ వ్యవస్థను ఆధునికీకరించడంలో కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం ఇవి దారుణమైనవని పేర్కొన్నారు.

  • ‘‘నిజమైన సంస్కరణలు రూపొందించడానికి ఓ మంచి అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు, పైపై మార్పులతో ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చారు. నంబర్లు, కొన్ని పదాలు మినహా 90శాతం ఒకేవిధంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో భారీ స్థాయిలో పెండింగులో ఉన్న కేసుల అంశాన్ని విస్మరించారు’’ అని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు. కింది కోర్టుల్లో మూడున్నర కోట్ల కేసులు, హై కోర్టుల్లో 60లక్షలకు పైగా, సుప్రీం కోర్టులో 75 నుంచి 80వేల కేసులు మరుగునపడిపోయి ఉన్నాయన్నారు.
  • నేర న్యాయ వ్యవస్థను నవీకరించడంతోపాటు, నిర్ణీత సమయంలో న్యాయం అందించడంలో ఇదో ముందడుగు అని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది అదీశ్‌ సీ అగర్వాల్‌ అన్నారు. వాదనలు పూర్తైన 30రోజుల్లోపు, గరిష్ఠంగా 45రోజుల్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు.
  • సీనియర్‌ అడ్వకేట్‌, భాజపా ఎంపీ మహేశ్‌ జెఠ్మలానీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ప్రతి ఒక్కరికోసమనే విషయాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడం లేదన్నారు.
  • కొత్త చట్టాలు దారుణమైనవని కాంగ్రెస్‌ ఎంపీ, న్యాయవాది మనీశ్‌ తివారీ పేర్కొన్నారు. నేటి నుంచి రెండు సమాంతర వ్యవస్థలు నడుస్తాయని, జూన్‌ 30, 2024 అర్థరాత్రి ముందు నమోదైన కేసులు పాత చట్టం ప్రకారం, ఆ తర్వాత నమోదైనవి కొత్త చట్టాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో కేసులు పెండింగులో ఉన్న దృష్ట్యా వీటిపై పూర్తి గందరగోళం ఏర్పడుతుందన్నారు.
  • సాధారణ పౌరులు, లాయర్లు, దర్యాప్తు సంస్థల్లో వీటితో ఎవరికి ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదని మరో న్యాయవాది కామినీ జైశ్వాల్‌ అన్నారు. వీటిని వైఫల్యంగా అభివర్ణించిన ఆమె.. ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
  • ఈ మూడు చట్టాలు దేశవ్యాప్తంగా కొత్త వివాదానికి దారితీశాయని న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది అశ్వినీ కుమార్‌ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నా గణనీయమార్పు రాలేదని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారని అన్నారు.
  • తాజా చట్టాలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మద్దతు తెలిపింది. అంతేకాకుండా వీటి అమలును వ్యతిరేకిస్తూ ఎటువంటి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిల్స్‌కు ఇటీవల విజ్ఞప్తి చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని