IMD: కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌

రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Published : 01 Jul 2024 19:14 IST

దిల్లీ: ఉత్తరభారతాన్ని వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని (Weather Report) భారత వాతావరణశాఖ (IMD) తాజాగా వెల్లడించింది. వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ (Red Alert) జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గుజరాత్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. జులై 5 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.

రాబోయే నాలుగైదు రోజుల్లో భారత్‌లోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో  రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

  • అరుణాచల్‌ప్రదేశ్‌లో జులై 1, 4, 5 తేదీల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
  •  త్రిపుర, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో జులై 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవొచ్చు.
  • గుజరాత్‌లో జులై 1న, ఉత్తరాఖండ్‌లో జులై 2న, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 1, 2 తేదీల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
  • రాబోయే ఐదు రోజుల్లో వాయవ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
  • కేరళ, లక్షద్వీప్‌, కోస్టల్‌ కర్ణాటక, కొంకణ్‌, గోవా, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
  • కోస్తా ఆంధ్ర, యానాం, మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు