Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్‌.. రక్తసంబంధాన్ని మళ్లీ కలిపింది!

కూలి పనుల కోసం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చాడు. అతడి సోదరి ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తించి స్వగ్రామానికి రప్పించింది. 

Published : 29 Jun 2024 22:53 IST

కాన్పూర్‌: చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లి పోయిన వ్యక్తి  కొన్నేళ్లకు తిరిగి వస్తే.. ఆ కుటుంబం ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) కాన్పూర్‌కు (Kanpur) చెందిన రాజకుమారికి సరిగ్గా అలాంటి అనుభూతే కలిగింది. 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సోదరుడు బాల్ గోవింద్‌ మళ్లీ కనిపించడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వారిద్దరూ మళ్లీ కలవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ సాయం చేసింది. ఎలాగో తెలుసా?

బాల్‌ గోవింద్‌ 18 ఏళ్ల క్రితం తన స్వగ్రామం ఫతేపుర్‌లోని ఇనాయత్‌పుర్‌ నుంచి పని కోసం ముంబయి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల వరకు గ్రామంలోని కొందమందితో టచ్‌లో ఉండేవాడు. క్రమంగా అది కూడా తగ్గిపోయింది. ఒక రోజు తీవ్ర అస్వస్థతకు గురై.. ఇంటికి వచ్చేయాలనుకున్నాడు. కాకపోతే, పొరపాటున రాజస్థాన్‌ ట్రైన్‌ ఎక్కేశాడు. తీరా చూస్తే.. రైలు జైపుర్‌లో ఉంది. స్టేషన్‌లో దిగి.. దిగాలుగా కూర్చున్న అతడికి ఓ వ్యక్తి ఉద్యోగం ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఆరోగ్యం కుదురుకున్నాక.. గోవింద్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈశ్వర్‌దేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు.

వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్‌ యాప్‌’ మాయలో సివిల్స్ అభ్యర్థి

అయితే, ఎక్కడికి వెళ్లినా అక్కడి విశేషాలను తెలియజేస్తూ ఇన్‌స్టా రీల్స్‌ చేయడం అతనికి అలవాటుగా మారింది. జైపుర్‌లోని వివిధ చారిత్రక స్థలాల గురించి పోస్టు చేస్తూ కాస్త పాపులర్‌ అయ్యాడు. ఒక రోజు అతడి సోదరి రాజకుమారి ఇన్‌స్టా రీల్స్‌ చూస్తూ.. ఒక దగ్గర ఆగింది.అది గోవింద్‌ చేసిన రీల్‌.. ఎందుకో ఆమెకు అనుమానం వచ్చింది. తన సోదరుడిలా కనిపిస్తున్నాడనుకొని, మరిన్ని రీల్స్‌ చూసింది. కచ్చితంగా నిర్ధరించుకున్న తర్వాత అతడికి మెసేజ్‌ చేసి..తన గురించి చెప్పింది. ఇద్దరూ తమ చిన్ననాటి సంగతులను పంచుకున్నారు. వెంటనే చకచకా ఫోన్‌నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తిరిగి ఇంటికి వచ్చేయాలని ఆమె కోరగా.. బాల గోవింద్‌ అంగీకరించాడు. భార్య, పిల్లలతో కలిసి ఈ నెల 20 స్వగ్రామానికి వచ్చాడు. దీంతో ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని