LS Speaker: స్పీకర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

విపక్షాల నిర్ణయంతో స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికకు మూడోసారి ఎన్నిక అనివార్యమైంది.

Published : 25 Jun 2024 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ (Lok Sabha Elections) స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తెరపడింది. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్‌ ఎన్నికకు మూడోసారి ఓటింగ్‌ అనివార్యమైంది. కొన్నిసార్లు మినహా దశాబ్దాలుగా స్పీకర్‌ పదవిని అధికార పక్షం చేపట్టగా.. విపక్షాలు డిప్యూటీ స్పీకర్‌ పదవి చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ (Speaker election) ఎన్నిక ఏవిధంగా జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తే..

సీక్రెట్‌ బ్యాలెట్‌తోనే..

స్పీకర్‌ ఎన్నిక నిర్వహణకు ఎటువంటి కాల వ్యవధి లేదు. అయితే.. కొత్త లోక్‌సభ కొలువుదీరిన అనంతరం సాధ్యమైనంత త్వరగా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 93’ చెబుతోంది. సాధారణ మెజార్టీతోనే స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్‌గా ఎన్నికవుతారు.

50 ఏళ్లలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. అభ్యర్థిని నిలబెట్టిన ఇండియా కూటమి

లోక్‌సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా ఈ పదవికి పోటీ పడవచ్చు. ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కేవలం సభలో సభ్యుడు/సభ్యురాలిగా ఉంటే చాలు. సీనియారిటీ, నిష్పాక్షికత వంటి ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను నిలబెడతారు. అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా స్పీకర్‌ను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94 ప్రకారం, నోటీసులు ఇచ్చిన 14 రోజుల తర్వాతే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

కీలకం ఎందుకంటే..?

లోకసభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్‌దే కీలక పాత్ర. సభను ఆర్డర్‌లో ఉంచడం, సభా గౌరవాన్ని కాపాడటంతోపాటు సమావేశాల అజెండా, వాయిదా, అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత ఆయనదే. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం సభ నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే, అనర్హత విధించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. సభా నియమాలను పాటిస్తూనే వాటిని స్పీకర్‌ అమలుచేయాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయాలను సవాలు చేయలేరు.  లోక్‌సభలో సభ్యుడు/సభ్యురాలు అయినప్పటికీ.. సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

విపక్షాల బలంతో..

గత రెండుసార్లు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగించిన భాజపా.. ఈసారి మాత్రం మెజార్టీ మార్కుకు 32 సీట్లు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఎన్డీయేకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా స్పీకర్‌ ఎన్నిక కీలకంగా మారింది. అధికార పక్షం నుంచి ఓం బిర్లా నామినేషన్‌ వేయగా.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ బరిలో నిలిచారు. అయితే, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడవు ఉంది. ఆలోపు విపక్షాలు వెనక్కి తగ్గకపోతే జూన్‌ 26న ఉదయం 11 గంటలకు స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు