Agnipath: అగ్నిపథ్‌ నిరసనల మధ్య కేంద్రం కీలక నిర్ణయం

సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

Updated : 18 Jun 2022 11:55 IST

దిల్లీ: సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు (Agnipath Protests) వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరుల (Agniveers)కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరుల (Agniveers)కు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్‌ అగ్నివీరుల (Agniveers)కు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్‌ (Agnipath)కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: అగ్నిపథ్‌పై ఎందుకింత అలజడి?)

పారామిలిటరీ బలగాలుగా వ్యవహరించే సరిహద్దు భద్రతా దళం (BSF), కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (CRPF), ఇండో-టిబెటన్‌ సహరిద్దు పోలీసులు (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB)‌, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)తో పాటు నేషనల్‌ సెక్యూరిటీ గార్డు (NSG), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు (SPG)ను కలిపి కేంద్ర సాయుధ బలగాలు (CAPF)గా పేర్కొంటారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం.. సీఏపీఎఫ్‌ (CAPF), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles)లో ప్రస్తుతం 73,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మరో 18,124 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ‘అగ్నిపథ్‌’ (Agnipath)పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు  సైనిక ఉద్యోగార్థులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 234 రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని