Pune Porsche Case: పుణె కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుణె కారు ప్రమాదం కేసులో నిందితుడిని తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని బాంబే హైకోర్టు అనూహ్య తీర్పు వెలువరించింది.

Published : 25 Jun 2024 18:07 IST

పుణె: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుణె కారు ప్రమాదం కేసులో (Pune Porsche Case) బాంబే హైకోర్టు (Bombay High Court) అనూహ్య తీర్పు వెలువరించింది. నిందితుడిని తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భారతి దాంగ్రే, జస్టిస్‌ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అబ్జర్వేషన్‌ హోంలో ఉన్న నిందితుడిని విడుదల చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘‘ మనమంతా చట్టానికి, జువైనల్‌ జస్టిస్‌ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. కేసులో తీవ్రత ఉన్నప్పటికీ చట్ట విరుద్ధంగా మైనర్లను పెద్దవారి మాదిరిగా పరిగణించకూడదు’’ అని పేర్కొంది.

నిందితుడిని అబ్జర్వేషన్‌ హోమ్‌లో నిర్బంధిస్తూ జువైనల్‌ జస్టిస్‌ బోర్డు (జేజేబీ) ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధమని, అధికార పరిధిని దాటి ఆదేశాలిచ్చారని కోర్టు అభిప్రాయపడింది. జేజేబీ ఆదేశాల ప్రకారం నిందితుడు పునరావాసంలో, మానసిక నిపుణుడి పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పిన న్యాయస్థానం.. సీసీఎల్‌ చట్టానికి లోబడి అతడి వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. టీనేజర్‌ బంధువుల తరఫు న్యాయవాది ప్రశాంత్‌ పాటిల్‌ వాదనలు వినిపిస్తూ జువైనల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం.. పిల్లల్ని నిర్బంధించకూడదని కోర్టుకు తెలిపారు. చట్ట విరుద్ధంగా అతడిని బంధించారని వెంటనే విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు.

మే 19 అర్ధరాత్రి పుణెలో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కేసు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్‌ పోలీసులకు సాయం..తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్‌ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని తిరిగి అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. ఈ క్రమంలో నిందితుడి తరఫు బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏ నిబంధనల ప్రకారం జేజేబీ బెయిల్‌ ఆర్డర్‌ను సవరించిందని ప్రశ్నించింది. బోర్డు సవరించిన బెయిల్‌ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కూడా హైకోర్టులో ఎలాంటి దరఖాస్తు చేయలేదని ధర్మాసనం పేర్కొంది.

ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. కారకుడిగా భావిస్తున్న టీనేజర్‌ కూడా గాయపడినట్లు ధర్మాసనం ప్రస్తావించింది.‘‘ ఇది ఎలాంటి రిమాండ్‌?ఏ అధికారంతో నిందితుడికి మళ్లీ రిమాండ్‌ విధించారు. ఓ వ్యక్తికి తొలుత బెయిల్‌ మంజూరు చేసి, మళ్లీ రిమాండ్‌కు పంపడం ఏంటి? దీనికి ఏ విధానాన్ని అవలంబించారు?’’ అని కోర్టు ప్రశ్నించింది. బెయిల్‌ మంజూరైన వ్యక్తిని మళ్లీ అబ్జర్వేషన్‌ హోంలో ఉంచడం నిర్బంధం కాదా? అని నిలదీసింది. ఏ అధికారంతో ఆదేశిలిచ్చారని, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని