Hemant Soren: హేమంత్‌ సోరెన్‌ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు భారీ ఊరట లభించింది.

Updated : 29 Jun 2024 05:52 IST

ఈడీ వాదనల్లో బలం లేదు
ఝార్ఖండ్‌ మాజీ సీఎంకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు వ్యాఖ్యలు

రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు ఝార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ రొంగోన్‌ ముఖోపాధ్యాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు వివరాలను చూస్తే సోరెన్‌ దోషి అని నమ్మడానికి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఏ నేరానికీ పాల్పడలేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్‌ ఇస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వాదనలు కూడా అంత బలంగా లేవని అన్నారు. రూ.50,000 బెయిల్‌ బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తుతో సోరెన్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించారు.  మనీలాండరింగ్‌ కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఐదు నెలలు కటకటాల వెనుక గడపాల్సిన పరిస్థితులు సృష్టించారని జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం హేమంత్‌ సోరెన్‌ పేర్కొన్నారు. 

ఝార్ఖండ్‌ మాజీ సీఎం సోరెన్‌కు బెయిల్‌ లభించడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ,  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని