Heavy Rains: దిల్లీ.. తల్లడిల్లి

భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది.

Updated : 29 Jun 2024 06:43 IST

దేశ రాజధాని నగరంలో వర్షబీభత్సం
24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం
విమానాశ్రయ పైకప్పు కూలి ఒకరు...
విద్యుదాఘాతం, నీటమునిగి నలుగురి దుర్మరణం
దేశీయంగా పలు విమాన సర్వీసుల రద్దు
సమీక్షించిన మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పు కూలి ధ్వంసమైన ట్యాక్సీలు

దిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. 24 గంటల్లో ఏకంగా 228 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం కూలి ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోహిణీ కాలనీలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి (39) మృతిచెందగా.. వసంత్‌ విహార్‌ వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఉస్మాన్‌పుర్‌ ప్రాంతంలో వర్షపునీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు, షాలిమార్‌ బాగ్‌ అండర్‌పాస్‌ వద్ద నిలిచిన నీటిలో మునిగి మరో యువకుడు మృతిచెందారు. రోడ్లపై మైళ్ల దూరం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రగతి మైదాన్‌తోపాటు పలుచోట్ల కీలక ప్రాంతాల్లో ఉన్న సొరంగ మార్గాలను మూసివేశారు. దిల్లీ రైల్వేస్టేషనులో, పలు మెట్రోస్టేషన్ల వద్ద మోకాటిలోతు వరదనీరు చేరింది. నగరంలో చాలాచోట్ల విద్యుత్తు లైన్లు, స్తంభాలు కూలిపోగా.. ముందు జాగ్రత్తగా సరఫరాను నిలిపివేశారు. ఆజాద్‌పుర్‌ వంతెన కింద చిక్కుకుపోయిన ఓ బస్సు నుంచి 21 మంది ప్రయాణికులను అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడారు. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌ పరిసరాల్లో గురువారం నుంచీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన వేడి వాతావరణం తర్వాత ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దిల్లీలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దిల్లీ సర్కారు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.  

మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు 

రద్దీగా ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం కూలి ట్యాక్సీలపై పడింది. ఈ ప్రమాదంలో రమేశ్‌కుమార్‌ (45) అనే ట్యాక్సీ డ్రైవరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశీయంగా విమానాలు తిరిగే టెర్మినల్‌-1 నుంచి బయలుదేరాల్సిన అన్ని సర్వీసులను తదుపరి నోటీసు జారీ చేసేవరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. టెర్మినల్‌-1 ప్రయాణికులందరికీ తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలని వారిపై అదనపు భారం పడకుండా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అన్ని విభాగాల అధికారులతో మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్మాణాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అయిదు రోజుల్లోపు నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

నేరపూరిత నిర్లక్ష్యం: కాంగ్రెస్‌

దిల్లీ విమానాశ్రయ ఘటన గత పదేళ్ల మోదీ సర్కారు అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. నాసిరకం నిర్మాణంతో కూలిన టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆరోపించారు. ఈ విమర్శలపై మంత్రి  రామ్మోహన్‌ నాయుడు స్పందిస్తూ..‘‘ఈరోజు కూలింది పాత భవనంలోని పైభాగం. దానిని 2009లో నిర్మించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలివైపు ఉంది. సాంకేతిక కమిటీ అన్నీ తనిఖీ చేస్తుంది.  మంత్రిత్వశాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తాయి’’ అని వెల్లడించారు.


88 ఏళ్ల తర్వాత మళ్లీ అత్యధిక వర్షం

శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి.. 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 1936 జూన్‌ 24న దిల్లీలో 235.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 88 ఏళ్ల తర్వాత.. శుక్రవారం నమోదైనదే జూన్‌ నెలలో  మళ్లీ అత్యధిక వర్షపాతం. దిల్లీలో వారాంతపు రోజుల్లో భారీ నుంచి అతి భారీవర్షం కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 


ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టారు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా దిల్లీలోనే ఉన్నారు. వారిలో కొందరి నివాసాలు వర్షపునీటిలో చిక్కుకుపోయాయి. నగరంలో నీటిఎద్దడి పరిష్కారానికి ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్‌ నేత, దిల్లీ జలమంత్రి ఆతిశీ ఇంటి చుట్టూ నీరు చేరింది. ఇంట్లోకి నీరు చేరి  వస్తువులన్నీ పాడైనట్లు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు.  మరో ఎంపీ మనీశ్‌ తివారీ (కాంగ్రెస్‌) సైతం తన ఇంటి చుట్టూ చేరిన వరదనీటి వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్‌ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద వర్షపునీరు నిలవడంతో సిబ్బంది ఎంపీని ఎత్తుకొనివచ్చి కారులో కూర్చోబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని