Hathras Stampede: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?

Hathras stampede: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 03 Jul 2024 10:35 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తొక్కిసలాట (Hathras stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా.. ఈ విషాదం తర్వాత భోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

‘‘తొక్కిసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్‌లో భోలే బాబా (Bhole Baba) కన్పించలేదు. ఆయన ఇక్కడ లేరు’’ అని డీఎస్పీ సునీల్‌కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్సంగ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదార్‌ దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. బాబా పేరును ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు.

మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం

సత్సంగ్‌కు 2.5లక్షల మంది..

హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి ఈ సత్సంగ్‌ (satsang) కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 80వేల మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు దీనికి అనుమతినిచ్చారు. కానీ మంగళవారం 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌

మరోవైపు, హాథ్రస్‌ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు