Delhi Airport: దిల్లీ విమానాశ్రయ ఘటన.. కేంద్రం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ’ ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Jun 2024 00:13 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని విమానాశ్రయం (Delhi Airport)లో టెర్మినల్‌-1 పైకప్పు కొంతభాగం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న, పెద్ద విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI)’ ఆదేశాలు జారీ చేసింది. 2-5 రోజుల్లో నివేదికలు సమర్పించాలని సూచించింది. తద్వారా భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

‘వార్‌ రూం’ ఏర్పాటుకు నిర్ణయం

ప్రమాదం కారణంగా టర్మినల్‌-1లో విమాన కార్యకలాపాలను ఇప్పటికే నిలిపేసి, వాటిని టీ-2, టీ-3లకు మార్చారు. ఈ నేపథ్యంలో ఆ రెండు టర్మినళ్లలో ప్రయాణికులకు సమర్థమంతమైన సేవలు అందించేందుకుగానూ 24 గంటలూ అందుబాటులో ఉండే ‘వార్ రూం’ను ఏర్పాటు చేయాలని పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. సంబంధిత శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ఈమేరకు ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రద్దయిన ఫ్లైట్‌ల టికెట్‌ రీఫండ్‌, ప్రత్యామ్నాయ రూట్లలో టిక్కెట్ల జారీ వంటి బాధ్యతలను ‘వార్‌ రూం’ నిర్వహిస్తుందని ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

కూలిన టెర్మినల్‌ పైకప్పు.. అది మోదీ ప్రారంభించినది కాదు: రామ్మోహన్‌ నాయుడు

దిల్లీ ఎయిర్‌పోర్టులోని ‘టీ-1’లో ఇండిగో, స్పైస్‌జెట్‌ దేశీయ విమాన సర్వీసులు కొనసాగుతాయి. ప్రమాదం నేపథ్యంలో ఈ రెండు ఎయిర్‌లైన్స్‌కు చెందిన 100కు పైగా విమానాలు రద్దయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ప్రస్తుత పరిస్థితులు టికెట్‌ ధరల పెరుగుదలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని అన్ని ఎయిర్‌లైన్స్‌కు అడ్వైజరీ జారీ అయ్యింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని నివారించేందుకు ఛార్జీల స్థిరత్వాన్ని కొనసాగించాలని కేంద్రం తెలిపింది. పైకప్పు కూలిన ఘటనను సమగ్రంగా విశ్లేషించాలని ఐఐటీ దిల్లీ నిపుణులను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని