Odisha: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..

గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఆలయానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు దట్టమైన అడవిలో చిక్కుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో 11 గంటల పాటు అక్కడే గడిపారు. 

Updated : 02 Jul 2024 20:30 IST

భువనేశ్వర్‌: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps)ను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకున్న ఘటనలు తరచూ వింటున్నాం. తాజాగా ఒడిశా (Odisha)లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకొంది. ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన కొందరు విద్యార్థులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని దారి తప్పి దట్టమైన అడవిలో చిక్కుకున్నారు. ఆకలి దప్పికలతో 11 గంటల పాటు నరకం అనుభవించారు. వివరాల్లోకి వెళితే..

కటక్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సప్తసజ్య ఆలయానికి జూన్‌ 30న వెళ్లారు. ద్విచక్రవాహనాలపై అక్కడికి చేరుకున్న వారు కొండపై ఉన్న విష్ణుబాబా మఠానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్‌ సహాయంతో తిరుగు పయనమైన క్రమంలో వారు దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు.

అలసట, ఆకలి, దప్పికలతో చాలా సేపు సహాయం కోసం ప్రయత్నించారు. అలా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి పోలీసులను సంప్రదించగలిగారు. అప్రమత్తమైన రెస్క్యూ బృందం అడవిలో గాలింపులు చేపట్టి విద్యార్థులను రక్షించింది. ‘‘ఆలయాన్ని సందర్శించిన తర్వాత గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా మేమున్న చోటుకు కొంత దూరంలో అందమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నాం. అక్కడికి చేరుకునే ప్రయత్నంలో అడవిలో చిక్కుకుపోయాం’’ బాధితులు పేర్కొన్నారు.

టీషర్ట్‌, చిరిగిన జీన్స్‌ ధరించి కాలేజీకి రావొద్దు!

ఇటీవల కేరళలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకొంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యాటక బృందం కేరళకు వెళ్లింది. అర్థరాత్రి గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అలప్పుళ ప్రాంతానికి వెళ్తుండగా కారు నీటి ప్రవాహంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు దీన్ని గమనించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని