అస్సాంలో వరద బీభత్సం

అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు.

Updated : 05 Jul 2024 05:11 IST

56కు చేరిన మృతుల సంఖ్య 
నిరాశ్రయులైన 16లక్షల మంది

గువాహటి: అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో 21 లక్షల మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారిక బులెటిన్‌ పేర్కొంది. దుబ్రి, దరంగ్, లఖింపుర్‌ జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పలువురు కేంద్ర మంత్రులు గురువారం పర్యటించారు. పలువురు బాధితులను పరామర్శించారు. ఈ పర్యటనలు మరో రెండు రోజుల పాటు ఉండనున్నాయి. ప్రస్తుతానికి వరదల పరిస్థితి అదుపులోనే ఉందని.. వచ్చే కొద్దిరోజుల పాటు ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి దీని స్థితిలో మార్పులు ఆధారపడి ఉంటాయని బిశ్వశర్మ పేర్కొన్నారు. 


దేవభూమిని వణికిస్తున్న వర్షాలు

దేహ్రాదూన్, శిమ్లా, మండీ: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్‌గఢ్, ఉధమ్‌సింగ్‌ నగర్‌తోపాటు కుమాన్‌ తదితర ప్రాంతాల్లో మరో వారంరోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దేహ్రాదూన్, తేహ్రి, హరిద్వార్‌ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకనంద, భాగీరథీ, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్‌ వద్ద నది ఒడ్డున ఏర్పాటుచేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నైనీతాల్, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు, గోమతి, కాళీ, గౌరీ, శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా, తవాఘాట్‌ జాతీయ రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి. 

  • హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో మండిలో 59, శిమ్లాలో 21 సహా మొత్తం సుమారు 85 రహదారులను మూసేశారు. శుక్రవారం వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ శిమ్లా వాతావరణ విభాగం ‘ఆరెంజ్‌’ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని సుందర్‌నగర్‌లో అత్యధికంగా 11.9 సెం.మీ.వాన కురిసింది.

కాజీరంగాలో 31 జంతువుల మృత్యువాత

కాజీరంగా నేషనల్‌ పార్క్‌లోకి నీరు చేరడంతో ఇప్పటి వరకు 31 జంతువులు మృతిచెందాయని, 82 వన్యప్రాణులను రక్షించగలిగామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతిచెందిన వాటిలో 23 హాగ్‌ జింకలున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 20 జంతువులకు చికిత్స అందిస్తున్నామని, 31 జంతువులను చికిత్స అనంతరం వదిలిపెట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాయల్‌ బెంగాల్‌ పులి (పెద్దపులి) పార్క్‌ నుంచి తప్పించుకుని నగావ్‌ జిల్లాలోని ఓ గ్రామంలోకి చొరబడినట్లు అధికారులు చెప్పారు. దానిని బందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

  • మరోవైపు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలిస్తే రోడ్లన్ని పునరుద్ధరించేందుకు కనీసం వారం రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని