కర్ణాటక-ఏపీ సరిహద్దుల సర్వే

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది.

Published : 05 Jul 2024 04:44 IST

బీ-1 గనుల్ని పరిశీలించిన సీఈసీ బృందం 

బళ్లారి, న్యూస్‌టుడే: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది. గనుల లీజుదారుల నుంచి సమితి సభ్యులు సి.పి.గోయల్, సునీల్‌ లిమయే నేతృత్వంలో అధికారులు పత్రాలను స్వీకరించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తుమటి, విఠలాపురం గ్రామాల పరిధిలోని నాలుగు గనులు, హలకుంది, బెళగల్లు, హొన్నాళ్లి గ్రామాల సరిహద్దులోని ఒక్కో గనిని పరిశీలించారు. సీఈసీ అధికారులతో పాటు కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు చెందిన గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు, జిల్లా ఉప విభాగం అధికారి హేమంత్, సండూరు తహసీల్దార్, రెవెన్యూశాఖ, భూ రికార్డుల అధికారులూ ఉన్నారు. గతంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులో సర్వే చేసి గుర్తించిన రాళ్లను, అక్కడ జీపీఎస్‌ ద్వారా రీడింగులను పరిశీలించారు. గ్రామాల సరిహద్దుల ఆధారంగా గనుల లీజులు పొందామని, దాని ఆధారంగా గనుల పటాలను తయారు చేసి వర్గీకరించాలని లీజుదారులు సీఈసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సండూరు తాలూకా దోనిమలై ఎన్‌.ఎం.డి.సి. అతిథి భవనంలో సీఈసీ అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గనుల లీజుదారులు హాజరై తమ విన్నపాలు, ఆధార పత్రాలు సమర్పించవచ్చని అధికారులు సూచించారు. అనంతరం ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని