కొవిడ్‌లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు

భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది.

Published : 04 Jul 2024 04:32 IST

 

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. ఈ సమయంలో జన్మించిన శిశువులు తక్కువ బరువుతో ఉండే ముప్పు రెండింతలు ఉన్నట్లు జర్నల్‌ కమ్యూనికేషన్స్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. తక్కువ బరువుతో జన్మించే శిశువులు అభ్యసన సమస్యలు ఎదుర్కొంటారని, అలాంటి వారి సంఖ్య పెరిగితే దీర్ఘకాలంలో మానవ వనరులపై ప్రభావం పడుతుందని అమెరికాలోని నాట్రొ డామ్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్, నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు శిశువుల్లో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రామాణిక బరువు (2.5 కిలోలు) కన్నా తక్కువ బరువుతో జన్మించారు. వీరిలో 95శాతం మంది పిల్లలు తక్కువ, మధ్య ఆదాయాలు కలిగిన దేశాలకు చెందినవారు. వీరిలో సగం మందికి పైగా దక్షిణాసియాలోనే జన్మించారు. 2020 ఏప్రిల్‌-2021 ఏప్రిల్‌ మధ్య జన్మించిన శిశువులు అంతకు ముందు జన్మించిన శిశువులతో పోలిస్తే తక్కువ బరువుతో జన్మించారు. ఈ అధ్యయనం కోసం భారత్‌లో రెండు లక్షల మందికి పైగా శిశువులను పరిశీలించారు. వీరిలో 1.92లక్షల మంది కొవిడ్‌కు ముందు, 12 వేల మంది కొవిడ్‌ సమయంలో జన్మించిన వారున్నారు. కొవిడ్‌కు ముందు జన్మించిన వారిలో తక్కువ బరువున్న శిశువులు 17 శాతం ఉండగా, కొవిడ్‌ సమయంలో జన్మించిన వారిలో 20శాతం ఉన్నారు. కొవిడ్‌ సమయంలో జన్మించిన శిశువుల బరువు సగటున 11 గ్రాములు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని