మణిపుర్‌ ప్రభుత్వాన్ని విశ్వసించలేం

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది.

Published : 04 Jul 2024 04:32 IST

కుకీ తెగ ఖైదీని ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

దిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మైనారిటీ కుకీ తెగకు చెందిన విచారణ ఖైదీని జైలు నుంచి ఆస్పత్రికి తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిందితుడు మైనారిటీ కుకీ తెగకు చెందిన వాడనే వివక్షతో ఆస్పత్రికి తీసుకెళ్లక పోగా భద్రతా కారణాలను సాకుగా చూపడం దారుణం. అతనికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తున్నాం. ఆ ఖైదీ ఆరోగ్యం క్షీణించిందని నివేదికల్లో వెల్లడైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’ అంటూ ధర్మాసనం హెచ్చరించింది. లున్‌ఖోంగామ్‌ హవోకిప్‌ అనే ఖైదీ అనారోగ్యానికి గురైనా జైలు అధికారులు భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదన్న మణిపుర్‌ హైకోర్టు ఉత్తర్వును పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గువాహటి వైద్య కళాశాలకు నిందితుడిని తీసుకెళ్లి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చును మణిపుర్‌ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. వైద్య నివేదికలను ఈ నెల 15వ తేదీకల్లా తమకు అందజేయాలని ఆదేశించింది. మణిపుర్‌లో మెజారిటీ వర్గ మైతేయ్, మైనార్టీ వర్గ కుకీల మధ్య సాయుధ ఘర్షణలతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో తీవ్ర అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని