132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ

కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Published : 04 Jul 2024 06:22 IST

నాగ్‌పుర్‌లో మొదలైన పైలట్‌ ప్రాజెక్టు

చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌ పర్యటనలో మూడు బస్సులు కలిపిన ట్రాలీ బస్సు వద్ద గడ్కరీ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఓ జాతీయ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 132 సీట్లతో కూడిన విమానం తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం నాగ్‌పుర్‌లో పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు. ‘‘కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతుల ప్రత్యామ్నాయం, కాలుష్యరహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే విద్యుత్తు వాహనాలు వచ్చాయి. వందల సంఖ్యలో ఇథనాల్‌ పంపులు ఏర్పాటుకానున్నాయి. లీటరు పెట్రోలుకు రూ.120 ఖర్చుపెట్టే బదులు.. రూ.60తో ఇథనాల్‌ వాడొచ్చు. డీజిలు బస్సు కి.మీ. ప్రయాణానికి రూ.115 ఖర్చు అవుతుంది. అదే విద్యుత్తు ఏసీ బస్సుకు రూ.50 నుంచి రూ.60 అవుతుంది. దీంతో టికెటు ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుంది’’ అని నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ‘‘చెక్‌ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటం చూశా. ఇక్కడ కూడా టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో ఓ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాం. మన ప్రాజెక్టులోనూ 132 మంది కూర్చునేలా బస్సును రూపొందిస్తున్నాం. 40 కి.మీ. దూరం వెళ్లాక ఛార్జింగు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 40 సెకన్లపాటు ఛార్జింగు చేస్తే మరో 40 కి.మీ. వెళ్లొచ్చు. దీంతో కి.మీ. ఖర్చు రూ.35 నుంచి రూ.40 మాత్రమే అవుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని