అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది.

Published : 04 Jul 2024 06:22 IST

121కి చేరిన హాథ్రస్‌ మృతులు

తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో గుమిగూడిన స్థానికులు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. వీరిలో నలుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గాయపడిన వారు 28 మంది ఉన్నారు.  ఈ విషాదం తర్వాత భోలే బాబా అలియాస్‌ జగత్‌ గురు సాకార్‌ విశ్వహరి ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జరిగిన దారుణంపై మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక సికంద్రరావ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ముఖ్య సేవాదార్‌ దేవ్‌ప్రకాశ్‌ మధుకర్, ఇతర నిర్వాహకుల పేర్లను  చేర్చినా.. బాబా పేరును ఇందులో పొందుపరచలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. హాథ్రస్‌ జిల్లా సికంద్రరావ్‌ ప్రాంతం ఫుల్‌రయీ, ముగల్‌గఢీ గ్రామాల మధ్యలోని జీటీ రహదారిని అనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. జనం కిక్కిరిసి ఊపిరాడని కారణంగానే మరణాలు సంభవించాయని శవపరీక్షల్లో తేలిందని ఎటాలోని జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 

సంఘటనలో గాయపడి ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పరామర్శించారు. ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయవిచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ తొక్కిసలాట వెనుక ‘కుట్ర కోణం’ కూడా ఉండిఉండొచ్చని యోగి అనుమానం వ్యక్తం చేశారు. 

ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్‌ 

గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆదేశాల మేరకు హాథ్రస్‌ ఘటనపై దర్యాప్తునకు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయకమిషన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ శ్రీవాస్తవ నేతృత్వం వహించనున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు హేమంత్‌ రావు, భవేశ్‌ కుమార్‌ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిషన్‌ రెండు నెలల వ్యవధిలోపు ప్రభుత్వానికి తన దర్యాప్తు నివేదికను సమర్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని