గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సినేషను అవసరం

‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు.

Published : 04 Jul 2024 06:21 IST

రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం
అభినందించిన ప్రధాని మోదీ

దిల్లీ: ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. రచయిత్రిగా, దాతగా సుపరిచితురాలైన సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్య సమస్యలను తన ప్రసంగంలో ఆమె ప్రస్తావించారు. దీనిపై ప్రధానమంత్రి స్పందించారు. బుధవారం ఎగువసభకు వచ్చిన నరేంద్ర మోదీ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుమునుపు గర్భాశయ (సర్వైకల్‌) క్యాన్సర్‌ నివారణ మార్గాలపై అందరికీ అవగాహన కల్పించేలా సుధామూర్తి ప్రసంగించారు. ‘‘9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్‌ వ్యాక్సినేషను చేయవచ్చు. ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే  క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి.. అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం ఆ వ్యాక్సిన్‌ అందివ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు. సుధామూర్తి ప్రసంగాన్ని ఉద్దేశించి బుధవారం సభలో మోదీ మాట్లాడారు. ‘‘మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించింది. శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశాం. గర్భిణులకు వ్యాక్సినేషను తీసుకువచ్చాం’’ అని తెలిపారు. కాగా, గర్భాశయ క్యాన్సర్‌ను అదుపు చేయడానికి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు టీకాలు వేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని