రాహుల్‌గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు

మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 04 Jul 2024 04:27 IST

దిల్లీ: మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి అదనంగా ఒక ప్లటూన్‌ పారామిలిటరీ సిబ్బందిని, స్థానిక పోలీసులను అక్కడ విధుల్లో నియమించినట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. భాజపా, ఆరెస్సెస్‌లపై సోమవారం లోక్‌సభలో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలు అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ ఉదంతం తర్వాత మితవాద శక్తులు దిల్లీలోని రాహుల్‌ గాంధీ నివాసంపై దాడి చేయవచ్చనే సమాచారం నిఘా వర్గాల ద్వారా అందినట్లు పోలీసులు తెలిపారు. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ భాజపా నాయకులు బుధవారం జైసల్మేర్‌ హౌస్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత అక్బర్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్‌కు ప్రస్తుతం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్న విషయం తెలిసిందే.

హింసను ప్రేరేపించే వారు హిందూయిజాన్ని అర్థం చేసుకోలేరు: రాహుల్‌

విధ్వంసాలను, హింసను ప్రేరేపించే వారు హిందూయిజం మౌలిక సూత్రాలను అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై మంగళవారం జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్‌ కాంగ్రెస్‌ కార్యాలయంపై జరిగిన దాడి భాజపా, ఆరెస్సెస్‌లపై నేను చేసిన విమర్శలకు బలాన్ని చేకూర్చుతోంది’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రాహుల్‌ పోస్ట్‌ చేశారు. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం అహ్మదాబాద్‌లో భాజపా కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని