సంక్షిప్త వార్తలు

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రాల్లోని నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో వరద ఉద్ధృతి పెరిగింది.

Published : 04 Jul 2024 04:25 IST

ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు
అస్సాంలో 8 మంది మృత్యువాత

గువాహటి: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రాల్లోని నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో వరద ఉద్ధృతి పెరిగింది. అస్సాంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వరదల దెబ్బకు రాష్ట్రంలో 8 మంది మృత్యువాతపడ్డారు. 27 జిల్లాల్లో దాదాపు 16.25 లక్షల మంది తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనా, భూటాన్‌ దేశాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాంలో వరదలు సంభవిస్తున్నాయని, దీని నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేదని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముంపునకు గురైన వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి, రబ్బరు బోట్‌లో లైఫ్‌ జాకెట్‌ ధరించి సీఎం సందర్శించారు. మరోవైపు, వరదల కారణంగా మణిపుర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు అక్కడి రాష్ట్రప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. పాఠశాలలకూ గురువారం వరకు సెలవులు ఇచ్చారు.


ఎంపీగా అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రమాణం రేపు

దిల్లీ: ఖలిస్థానీ ఉద్యమ మద్దతుదారు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ ఈనెల 5న లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నట్లు ఫరీద్‌కోట్‌ ఎంపీ సరభ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్‌లో జైల్లో ఉన్న అమృత్‌పాల్‌ ప్రమాణం గురించి తాను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో మాట్లాడానని ఖల్సా చెప్పారు. శుక్రవారం స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణం ఉంటుందన్నారు. ఈ మేరకు అతడికి 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పెరోల్‌ లభించినట్లు తెలిపారు. అదే రోజు ఉగ్రనిధుల కేసు నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్‌ రషీద్‌ ప్రమాణం కూడా ఉంటుంది. అమృత్‌పాల్‌ జైలులో ఉంటూనే పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.


80-20 సూత్రంతో మెరుగైన జీవితం

మెరుగైన జీవితం కోసం 80-20 సూత్రాన్ని అనుసరించండి.
ఆరోగ్యం: 80% ఆహార నియమాలపై, 20% వ్యాయామంపై దృష్టిపెట్టండి.
సంపద: అలవాట్ల ద్వారా 80%,  జ్ఞానం ద్వారా 20% వస్తుంది. 
కమ్యూనికేషన్‌: 80% వినండి, 20% మాట్లాడండి. 
నేర్చుకోవడం: అర్థం చేసుకోవడంపై 80%, చదవడంపై 20% దృష్టిపెట్టండి. 
విజయం: పనిపై 80%, ప్రణాళికపై 20% దృష్టిసారించండి. 
బంధాలు: 80% ఇవ్వడం, 20% తీసుకోవడం నేర్చుకోండి. 
వృద్ధి: పట్టుదలతో 80%, ఆలోచనలతో 20% సిద్ధిస్తుంది.

హర్ష్‌ గోయెంకా, వ్యాపారవేత్త


నాన్‌ బయలాజికల్‌ చేష్టలివి!

52 నుంచి 99కి చేరుకుంటే పెరగడం కాదు.. తగ్గడం! 303 నుంచి 240కి చేరితే తగ్గడం కాదు.. పెరగడం!! పార్లమెంటులో జై శ్రీరామ్‌ అని నినదించడం మంచి ప్రవర్తన! అదే పార్లమెంటులో జై రాజ్యాంగం అని నినాదాలు చేయడం మాత్రం పిల్లచేష్ట!! నాన్‌ బయలాజికల్‌ విధానంలో జన్మించినవారి పిల్లచేష్టలివి. 

ప్రకాశ్‌రాజ్, సినీ నటుడు


ర్యాలీలకు వచ్చేవారిని పురుగుల్లా చూస్తారు!

భారత్‌లో ర్యాలీలకు (రాజకీయపరమైనవైనా, మతపరమైనవైనా..) పేదలను నాయకులు భారీ సంఖ్యలో తరలిస్తారు. అదంతా కేవలం వారి బల ప్రదర్శన కోసమే. ర్యాలీలకు వచ్చే సాధారణ ప్రజలను నేతలు పురుగుల్లా చూస్తారు. తమ పని పూర్తికాగానే వారిని పట్టించుకోవడం మానేస్తారు. కొందరు శక్తిమంతులైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఇలాంటి పెద్దపెద్ద ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు. హాథ్రస్‌ ఘటన ఇలాంటిదే. 

వినయ్‌కుమార్‌ జి.బి, ఇన్‌సైట్స్‌ఐఏఎస్‌ వ్యవస్థాపకుడు


త్వరలో సీయూఈటీ-యూజీ ఫలితాల తేదీ వెల్లడి
యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌

దిల్లీ: విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాల వెల్లడి తేదీ త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ బుధవారం తెలిపారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఫలితాలు షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 30నే వెలువడాల్సి ఉంది. నీట్, నెట్‌ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. 


లోక్‌సభ సభ్యుల ప్రమాణ నిబంధనలను సవరించిన స్పీకర్‌
నినాదాలు చేయడంపై నిషేధం

దిల్లీ: ఇటీవల లోక్‌సభలో కొందరు సభ్యులు ప్రమాణం చేస్తూ వ్యక్తిగత నినాదాలు, అన్య పదాలను చేర్చడాన్ని స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. ఇకపై అలాంటివి చోటు చేసుకోకుండా సభ నిబంధనలను సవరించారు. ప్రమాణ సమయంలో నిర్దేశిత ఫార్మాట్‌లో రూపొందించిన పత్రంలోని పదాలకు ముందు కానీ, తర్వాత కానీ అదనంగా వ్యాఖ్యలు, పదాలను చేర్చడాన్ని నిషేధిస్తూ సభాపతి మార్గదర్శకాలకు దానిని జత చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని