ఐదుగురు నిపుణుల కమిటీని నియమించండి

హాథ్రస్‌ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 04 Jul 2024 04:25 IST

హాథ్రస్‌ విషాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: హాథ్రస్‌ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దారుణ ఘటనపై వాస్తవ స్థితి నివేదికను సమర్పించేలా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాంటూ న్యాయవాది విశాల్‌ తివారీ తన పిటిషన్‌లో కోరారు. తొక్కిసలాట ఘటనలను ఎదుర్కొనేందుకు మండల, జిల్లా స్థాయిల్లో గల వైద్య సదుపాయాలపై రాష్ట్రాల నుంచి నివేదికలు కోరాలని విజ్ఞప్తి చేశారు. భారీ సభలు, సమావేశాల సందర్భంగా ప్రమాదాల నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.   

రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు

హాథ్రస్‌లో చిక్కుకుపోయిన భక్తులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 3000 మంది కోసం ప్రత్యేక రైళ్లు సమకూర్చింది. సికంద్రరావ్‌ రైల్వేస్టేషన్‌తో సహా ఆ మార్గంలోని సమీప స్టేషన్ల మీదుగా వెళ్లే పలు రైళ్లకు స్టాపేజీని ఏర్పాటు చేసింది.

సంతాపం తెలిపిన పుతిన్, కిషిద

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, దేశంలోని జర్మనీ, ఫ్రాన్స్, చైనా సహా వివిధ దేశాలకు చెందిన పలువురు రాయబారులు హాథ్రస్‌ ఘటనపై సంతాపాలు తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని