నీట్‌-యూజీని మళ్లీ నిర్వహించాలి

నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్‌ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

Published : 03 Jul 2024 05:02 IST

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్‌

దిల్లీ: నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్‌ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని కోరాయి. 

నీట్‌-యూజీని సమర్థంగా నిర్వహించలేకపోయిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలంటూ విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల జాతీయ నేతలంతా ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశారు. దిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ..పరీక్షను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్‌టీఏ అసమర్థత లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.  లోక్‌సభ సమావేశాల చివరి రోజైన బుధవారం పార్లమెంటు వరకూ ప్రదర్శన నిర్వహించాలని విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, సమాజ్‌వాదీ ఛాత్ర సభ, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పాల్గొన్నారు. 

  • మరోపక్క ఎన్‌టీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొందరు విద్యార్థులు పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. ‘కేంద్ర విద్యామంత్రిని బర్తరఫ్‌ చేయాలి’, ‘ఎన్‌టీఏను రద్దు చేయాలి’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లు ధరించి వారంతా పార్లమెంటు దిశగా నిరసన ప్రదర్శనకు యత్నించగా దిల్లీ పోలీసులు డజనుకు పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 
  • నీట్‌-యూజీ, పీజీ, యూజీసీ-నెట్‌ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ ‘ఇండియా ఎగైనెస్ట్‌ ఎన్‌టీఏ’ పేరిట పలు వామపక్ష విద్యార్థి సంఘాలు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక దీక్ష మంగళవారానికి ఏడో రోజుకు చేరుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని