మా అబ్బాయి మృతిచెందాక..మొత్తం రూ.1.08 కోట్లు అందాయి

విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లా పింపల్‌గావ్‌ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్‌’ అక్షయ్‌ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి.

Published : 03 Jul 2024 04:58 IST

‘అగ్నివీర్‌’ మృతుడి తండ్రి లక్ష్మణ్‌ 
లోక్‌సభలో చర్చ నేపథ్యంలో వెల్లడి

బుల్‌ఢాణా (మహారాష్ట్ర): విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లా పింపల్‌గావ్‌ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్‌’ అక్షయ్‌ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి. అక్షయ్‌ తండ్రి లక్ష్మణ్‌ గవాతే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2023 అక్టోబరులో సియాచిన్‌ వద్ద విధుల్లో ఉన్నపుడు అక్షయ్‌ మృతిచెందారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ‘అగ్నిపథ్‌’ పథకం కింద భర్తీ అయిన అగ్నివీరులను ప్రభుత్వం వాడుకొని వదిలేసే కార్మికులుగా పరిగణిస్తోందని, కనీసం ‘అమరువీరుల’ హోదా కూడా వారికి ఇవ్వడం లేదని ధ్వజమెత్తిన విషయం విదితమే. ఈ విమర్శలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బదులిస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వాద, సంవాదాల నేపథ్యంలో అక్షయ్‌ గవాతే కుటుంబ వివరణ వెల్లడికావడం గమనార్హం. సోమవారం సాయంత్రం లక్ష్మణ్‌ గవాతే మీడియాతో మాట్లాడుతూ.. రూ.48 లక్షలు బీమా కవరేజీ కింద, రూ.50 లక్షలు కేంద్రం నుంచీ, రాష్ట్ర సర్కారు తరఫున మరో రూ.10 లక్షలు తమకు అందినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని