6 రోజుల ముందే దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు

భారత్‌కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. మంగళవారం నాటికి అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణం కన్నా ఆరు రోజుల ముందే వీటి విస్తరణ పూర్తికావడం విశేషం.

Published : 03 Jul 2024 04:55 IST

దిల్లీ: భారత్‌కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. మంగళవారం నాటికి అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణం కన్నా ఆరు రోజుల ముందే వీటి విస్తరణ పూర్తికావడం విశేషం. ‘‘మంగళవారం ఈ రుతుపవనాలు రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లోని మిగతా భాగాలకు విస్తరించాయి. తద్వారా దేశం మొత్తం ఇవి వ్యాపించినట్లయింది. సాధారణంగా జులై 8న ఈ పరిణామం జరగాల్సింది’’ అని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా జరగడం వరుసగా ఇది మూడోసారని వివరించింది.  

ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కన్నా రెండు రోజులు ముందుగా.. మే 30న కేరళలో ప్రవేశించాయి. మహారాష్ట్ర వరకూ బాగానే పయనించాయి. ఆ తర్వాత బలహీనపడ్డాయి. దీంతో పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు వర్షాల కోసం చాలా కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ క్రమంలో దేశ వాయవ్య ప్రాంతంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగాయి. జూన్‌ 11 నుంచి 27 మధ్య 16 రోజుల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా జూన్‌లో సగటున 165.3 మిలీమీటర్లకు గాను 147.2 మిల్లీమీటర్ల మేర మాత్రమే వానలు పడ్డాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్‌ నెల వాటా 15 శాతంగా ఉంటుంది. వచ్చే 4-5 రోజుల్లో దేశ వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాలు చరుగ్గా ఉంటాయని ఐఎండీ మంగళవారం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని