సంక్షిప్త వార్తలు

18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే...

Published : 03 Jul 2024 03:51 IST

ఒకరోజు ముందుగానే లోక్‌సభ నిరవధిక వాయిదా
విపక్ష అవాంతరాలపై తీర్మానం

దిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే అది ఆమోదం పొందినట్లు సభాపతి ఓంబిర్లా ప్రకటించి, ఈ విషయాన్ని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే బుధవారం కూడా సభ కొనసాగాల్సి ఉంది. ప్రధాని ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హోంమంత్రి అమిత్‌షా బలపరిచారు. తర్వాత దానిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. విపక్ష చర్యలు పార్లమెంటరీ నిబంధనల్ని తుంగలో తొక్కాయని అధికారపక్షం ధ్వజమెత్తింది. వాటి తీరును ఓంబిర్లా కూడా తప్పుపట్టారు. మణిపుర్‌కు చెందిన ఎంపీలను మాట్లాడేందుకు అనుమతించాలని ప్రధాని ప్రసంగం అనంతరం విపక్షాలు కోరాయి. ఇప్పటికే వారిలో ఒకరు మాట్లాడారని స్పీకర్‌ చెప్పారు. వెల్‌ వద్దకు వెళ్లాలని విపక్ష సభ్యులకు ప్రతిపక్ష నేత రాహుల్‌ చెప్పడాన్ని సభాపతి తప్పుపట్టి మందలించారు. 


ఎంపీగా ప్రమాణం చేసేందుకు రషీద్‌కు పెరోల్‌

దిల్లీ: కశ్మీరీ నాయకుడు షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఇంజినీర్‌ రషీద్‌ ఎంపీగా ప్రమాణం చేసేందుకు వీలుగా దిల్లీ కోర్టు ఆయనకు షరతులతో 2గంటల కస్టడీ పెరోల్‌కు  అనుమతించింది. బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాపై రషీద్‌ గెలుపొందారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే అభియోగాలతో 2017లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తిహాడ్‌ కారాగారంలో ఉన్న రషీద్‌... ఎంపీగా ప్రమాణం చేసేందుకు మధ్యంతర బెయిల్‌ లేదా కస్టడీ పెరోల్‌ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్‌ఐఏ అభ్యంతరం తెలపకపోవడంతో ఈ నెల 5న ప్రమాణం చేసేందుకు వీలుగా రెండు గంటల కస్టడీ పెరోల్‌కు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్‌ జడ్జి చందర్‌ జిత్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. 


26న విచారణకు హాజరుకండి

పరువునష్టం కేసులో రాహుల్‌కు యూపీ న్యాయస్థానం ఆదేశం

సుల్తాన్‌పుర్‌: కేంద్రమంత్రి అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఈ నెల 26న కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ విచారణకు మంగళవారమే హాజరు కావాల్సి ఉన్నా.. పార్లమెంటు సమావేశాల కారణంగా రాహుల్‌ రాలేకపోయారు. విచారణకు తాజా తేదీని ఇవ్వాలన్న రాహుల్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.


సివిల్స్‌ ఆశావహుల కోసం నిర్మాణ్‌ పోర్టల్‌ 

ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం సమాయత్తమయ్యే అభ్యర్థుల కోసం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం దిల్లీలోని తన  కార్యాలయంలో నిర్మాణ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్‌ కర్మయోగి పథకానికి అనుగుణంగా బొగ్గు సంస్థల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. సివిల్‌ ప్రాథమిక పరీక్షల్లో పాస్‌ అయిన వారిని మెయిన్స్, ఇంటర్వ్యూలకు సమాయత్తం చేసేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనులున్న 39 జిల్లాల్లో సివిల్స్‌ సర్వీస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, యువతులు, థర్డ్‌ జెండర్‌లకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రిలిమ్స్‌ పాసైన వారికి రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు దీని ద్వారా ప్రయోజనం అందుకోవచ్చు.


భారత్‌ నుంచే కైలాస పర్వత దర్శనం

సెప్టెంబరు 15 నుంచి అనుమతి

ఫిథోరాగఢ్‌: టిబెట్‌లో ఉన్న కైలాస పర్వతాన్ని భారత భూ భాగం నుంచే దర్శించే అవకాశం భక్తులకు కలగనుంది. ఉత్తరాఖండ్‌ పిథోరాగఢ్‌ జిల్లా వ్యాస్‌వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తున ఉండే పాత లిపులేఖ్‌ పాస్‌ నుంచి కైలాస పర్వతం, ఓమ్‌ పర్వత్‌ స్పష్టంగా కనిపిస్తాయని జిల్లా పర్యాటక అధికారి కీర్తి చంద్ర ఆర్య పేర్కొన్నారు. సెప్టెంబరు 15 నుంచి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.


65 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకు బిహార్‌ ప్రభుత్వం

దిల్లీ: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతమున్న 50శాతం రిజర్వేషన్లను 65శాతానికి పెంచుకోవడం కోసం బిహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ పట్నా హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. రాజ్యాంగం ప్రకారం 50శాతం కోటాను మించిన రిజర్వేషన్లు చెల్లవంటూ జూన్‌ 20న ఇచ్చిన తీర్పులో హైకోర్టు పేర్కొంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని